Plasma Therapy: కొందరి ప్లాస్మాతో చికిత్స చేయడం సాధ్యం కాదంటున్న నిపుణులు!

  • కరోనా రోగులకు ఆశాకిరణంలా ప్లాస్మా చికిత్స
  • ఆరోగ్యవంతులే ప్లాస్మా దానం చేయాలన్న నిపుణులు
  • షుగర్, బీపీ ఉన్నవాళ్లు ప్లాస్మా దానానికి అనర్హులని వెల్లడి
Details of plasma donation amidst corona situations

కరోనా మహమ్మారి సోకినవారికి ప్లాస్మా ట్రీట్ మెంట్ ఇప్పుడో ఆశాకిరణంలా కనిపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో యాంటీబాడీలు తయారవుతాయన్న సంగతి తెలిసిందే. వారి నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా రోగుల్లో ప్రవేశపెడితే, ఆ ప్లాస్మాలోని యాంటీబాడీలు వెంటనే కరోనా క్రిములపై పోరాడి వాటిని అంతమొందిస్తాయి. ఇదీ సంక్షిప్తంగా ప్లాస్మా చికిత్స.

అయితే, కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరి ప్లాస్మా చికిత్సకు ఉపయోగపడుతుందని భావించలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్మా దానానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని అంటున్నారు. నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ప్లాస్మా ఎవరు దానం చేయాలంటే... 50 కిలోల కంటే అధిక బరువు ఉన్నవాళ్లు, పిల్లలు లేని మహిళలు, శరీరంలో ఆరోగ్యకరమైన స్థాయిలో హీమోగ్లోబిన్ కలిగి ఉన్నవాళ్లు, మధుమేహం, బీపీ లేని వాళ్లు నిరభ్యంతరంగా ప్లాస్మా దానం చేయవచ్చు.

ఇక, హెచ్ఐవీ రోగులు, హెపటైటిస్ బి, సి, ఇ, హెచ్ టీఎల్వీ-1, క్యాన్సర్ తో బాధపడుతున్నవాళ్లు ప్లాస్మా దానానికి అనర్హులు. పిల్లలను కన్న మహిళల్లో హీమోగ్లోబిన్ లెవల్స్ తక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో వారిని ప్లాస్మా దానం నుంచి మినహాయిస్తుంటారు. పైగా గర్భం సమయంలో వారిలో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ (హెచ్ఎల్ఏ)కి యాంటీబాడీలు తయారవుతాయని, ఇలాంటి వారి ప్లాస్మాను మరొకరికి ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని, ఊపిరితిత్తులు పాడైపోతాయని, కరోనా చికిత్సలో ఇది మరీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News