Pawan Kalyan: అధికారం రెండు వర్గాలకే పరిమితం కారాదని నమ్మిన వ్యక్తి వంగపండు: పవన్ కల్యాణ్

  • విప్లవ గాయకుడు వంగపండు మృతి
  • వంగపండు మరణం విషాదకరం అంటూ పవన్ వ్యాఖ్యలు
  • ఆయనతో రెండు దశాబ్దాల అనుబంధం ఉందని వెల్లడి
Pawan Kalyan condolences to the demise of Vangapandu Prasadarao

ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం వంగపండు ప్రసాదరావు చనిపోయారన్న వార్త తెలిసి ఎంతో బాధగా అనిపించిందని తెలిపారు. రాష్ట్రంలో అధికారం రెండు వర్గాల గుప్పెట్లో నలిగిపోతోందన్న ఆవేదనతో రగిలిన నేత వంగపండు అంటూ పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనతో తనకు రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉందని, జనసేన పార్టీ ఆవిర్భావాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించిన విప్లవ నాయకుల్లో ఆయన కూడా ఒకరని వెల్లడించారు.

ఏపీలో అధికారం రెండు వర్గాల చేతుల నుంచి అన్ని వర్గాలకు చేరిన నాడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని, అదే తన చిరకాల వాంఛ అని వంగపండు ఎప్పుడూ చెప్పేవారని, కానీ తన కోరిక తీరకముందే వెళ్లిపోవడం విషాదకరం అని తెలిపారు. ఆయన రచించి గానం చేసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా అనే గేయం ఉత్తరాంధ్రనే కాకుండా తెలుగు వాళ్లందరినీ జాగృతం చేసిందని కొనియాడారు. ఆయన స్వరం అలసిసొలసి విశ్రమించింది కానీ, ఆయన ఆశ ఉత్తరాంధ్ర కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని వివరించారు. ఆ విప్లవ గాయకునికి భారమైన మనస్సుతో నివాళులు అర్పిస్తున్నానని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News