కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా

04-08-2020 Tue 09:18
  • వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
  • తనను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలని సూచన
  • సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ దేవెగౌడ ట్వీట్
Karnataka Congress Leader Siddaramaiah Tests Positive For Coronavirus
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇటీవల తనతో కలిసిన వారిలో ఎవరికైనా వైరల్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సిద్ధరామయ్యకు నిన్న జ్వరంగా ఉండడంతో కరోనా యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని సిద్ధరామయ్య కుమారుడు తెలిపారు.

కాగా, సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ కరోనా బారినపడిన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ట్వీట్‌లో ఆకాంక్షించారు. యడియూరప్పతోపాటు ఆయన కుమార్తె పద్మావతి కూడా కరోనా బారినపడగా, కుమారుడు విజయేంద్రకు మాత్రం నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే, యడియూరప్ప కార్యాలయంలోని ఆరుగురు సిబ్బందికి కూడా నిన్న కరోనా సోకింది. సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలని జనతా దళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ ఆకాంక్షించారు.