Avanthi Srinivas: నా భర్త చనిపోయినా సమాచారం ఇవ్వలేదంటూ మహిళ చేసిన ఆరోపణపై మంత్రి అవంతి స్పందన!

  • ఇప్పటి వరకు కరోనా బాధితుడి ఫోన్ నంబర్ మాత్రమే తీసుకుంటున్నారు
  • ఇకపై కుటుంబ సభ్యుల నంబర్లు కూడా తీసుకోవాలని ఆదేశించాం
  • వైద్య సిబ్బంది ధైర్యంగా పని చేసే పరిస్థితి లేదు
Medical staff are not willing to work says Avanthi Srinivas

ఏపీలోని కరోనా ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు ఉండటం లేదంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఓ మహిళ నుంచి ఊహించని ఘటన ఎదురైంది. విశాఖలోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రి విమ్స్ ను ఈరోజు మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళ అవంతితో తన బాధను వ్యక్తం చేసింది. తన భర్త చనిపోయినా సిబ్బంది సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అనంతరం మీడియాతో అవంతి మాట్లాడుతూ, ఇప్పటి వరకు కరోనా బాధితుల ఫోన్ నంబర్లను మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారని... అందుకే బాధితుడు మృతి చెందే సందర్భంలో సమాచారం వారి కుటుంబీకులకు చేరడం లేదని చెప్పారు. ఇకపై కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లను కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

విమ్స్ లో ఇప్పటి వరకు 180 మంది చనిపోయారని అవంతి చెప్పారు. ప్రస్తుతం 595 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారని తెలిపారు. 300 మంది డాక్టర్లు పని చేయాల్సిన చోట కేవలం 80 మంది మాత్రమే పని చేస్తున్నారని చెప్పారు. కొంత మంది వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. వైద్య సిబ్బంది ధైర్యంగా పని చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో పని చేసేందుకు వైద్యులు, నర్సులు ముందుకు రావాలని కోరారు.

More Telugu News