Raghurama Krishnaraju: పవన్ కల్యాణ్ చెప్పింది బాగానే ఉంది... కానీ!: రఘురామకృష్ణరాజు

  • రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న పవన్
  • రాజీనామా కంటే రాజీలేని పోరాటం చేయాలన్న రఘురామ
  • బీటెక్ రవి రాజీనామా చేయడం సరికాదని వ్యాఖ్యలు
Raghurama Krishnaraju mentions Pawan Kalyan opinions on AP Capital issue

ఏపీ రాజధాని అంశంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాలు వెల్లడించారు. రాజధాని కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలన్న పవన్ కల్యాణ్ డిమాండ్ సహేతుకమైనదేనని, అయితే వారు రాజీనామా చేయడం వల్ల ఉపయోగంలేదని, వారు రాజీలేని పోరాటం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

ఇటీవలే రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గురించి ప్రస్తావిస్తూ, బీటెక్ చదివి బీటెక్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారని, విద్యాధికుడు అని కొనియాడారు. బహుశా ఆ ప్రాంతంలో రవి ఒక్కడే బీటెక్ చదివాడో ఏంటో మరి బీటెక్ రవి అని పేరొచ్చిందని, అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయడంలో అర్థంలేదని అన్నారు. మండలి సభ్యుడిగా ఉంటూనే రాజధాని అంశంలో రాజీలేని పోరాటం చేయడం సరైన విధానం అవుతుందని రఘురామ స్పష్టం చేశారు.

"నువ్వు రాజీనామా చేశావు కాబట్టి భవిష్యత్తులో నీకు భద్రతపరమైన సమస్యలు ఏర్పడవచ్చు. నేను ఎంపీని కాబట్టి నాకు కేంద్ర బలగాల భద్రత వస్తుందన్న నమ్మకమైనా ఉంది. ఎవరు ఎంత అడ్డుపడినా, నాలుగు రోజులు ఆలస్యమైనా భద్రత వస్తుంది. కానీ నీకు ఆ భద్రత కూడా రాదు. అందుకే ఇలాంటి రాజీనామాలు మానేసి రాజీలేని పోరాటం చేయి. నేను అందరికీ ఇదే చెబుతున్నాను. రాజధానిపై రిఫరెండం నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అర్థమైంది. అందుకే ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే వారి పరిధిలో ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి" అంటూ హితవు పలికారు.

More Telugu News