oxford: భారత్‌లో త్వరలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌.. విశాఖలో కూడా

  • ఆక్స్ ఫర్డ్‌తో ఇప్పటికే సీరం ఒప్పందం
  • భారత్‌లో వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌
  • భారత్‌లో 17 ప్రాంతాల్లో ప్రయోగాలు 
  • జాబితాలో ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ 
oxford vaccine trails in india

కరోనాతో అల్లాడుతోన్న ప్రపంచం ఎంతో ఆశగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఆ‌ విశ్వవిద్యాలయ నిపుణులు అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలు ఇస్తుండడమే ఇందుకు కారణం. ఆక్స్ ఫర్డ్‌తో ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో పరీక్షించడంతో పాటు, విజయవంతమైతే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది.

ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం సంస్థకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ చేసిన తొలి, రెండో దశ ఫలితాలను  'సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్' (సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ విశ్లేషించింది.

అనంతరం భారత్‌లో దీన్ని పరీక్షించేందుకు అనుమతించాలని డీసీజీఐకి సిఫార్సు చేయడంతో దీనికి అనుమతులు లభించాయి. భారత్‌లో 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చిన 29 రోజుల అనంతరం రెండో డోసు ఇస్తారు. వివిధ దశల్లో వ్యాక్సిన్ భద్రత, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి స్పందన వంటి అంశాలు తెలుస్తాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

More Telugu News