ధోనీ, పాంటింగ్ లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే ప్రశ్నకు అఫ్రిది సమాధానం ఇదే!

30-07-2020 Thu 14:16
  • యువ జట్టును ధోనీ అత్యున్నతంగా తీర్చిదిద్దాడు
  • అందుకే పాంటింగ్ కన్నా ధోనీకి ఎక్కువ రేటింగ్ ఇస్తాను
  • రిచర్డ్స్ నా అభిమాన బ్యాట్స్ మెన్
Dhoni is better captain than Ponting says Afridi

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీ, రిక్కీ పాంటింగ్ ఇద్దరూ గొప్ప కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి పేరిట రెండు ప్రపంచ కప్ టైటిల్స్ ఉన్నాయి. ఇద్దరూ కూడా తమతమ జట్లను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. అయితే వీరిద్దరిలో ధోనీనే గొప్ప కెప్టెన్ అని పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. పూర్తిగా యువకులతో ఉన్న జట్టును ధోనీ అత్యున్నత జట్టుగా తీర్చిదిద్దాడని కితాబిచ్చాడు.

అభిమానులతో ట్విట్టర్ ద్వారా నిన్న అఫ్రిదీ ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ధోనీ, పాంటింగ్ లలో ఎవరు గొప్ప కెప్టెన్ అనే ప్రశ్నకు సమాధానంగా... యువకులతో కూడిన జట్టును ధోనీ డెవలప్ చేశాడని... అందుకే పాంటింగ్ కంటే ధోనీకి తాను ఎక్కువ రేటింగ్ ఇస్తానని చెప్పాడు.

ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 ప్రపంచకప్ ను, 2011లో ప్రపంచకప్ ను గెలుచుకుంది. మరోవైపు పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచకప్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ప్రశ్నలకు అఫ్రిది సమాధానమిస్తూ... వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తన అభిమాన బ్యాట్స్ మెన్ అని, పాకిస్థాన్ కు చెందిన అబ్దుల్ ఖాదిర్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ స్పిన్నర్ అని చెప్పాడు.