సినీ నటి వనితపై పలువురి నుంచి పోలీసులకు ఫిర్యాదులు

30-07-2020 Thu 11:12
  • మూడో పెళ్లి చేసుకున్నందుకు వనితపై విమర్శలు
  • ఘాటుగా సమాధానాలు ఇస్తున్న వనిత
  • తనను, తన భర్తను విమర్శించిందంటూ దర్శకురాలు లక్ష్మి ఫిర్యాదు
  • కరోనా వేళ ఓ వేడుక నిర్వహించిందని కొందరి ఫిర్యాదు
complaints against vanita

సినీ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు, సినీనటి, బిగ్‌ బాస్‌-3 ఫేమ్ వనితా విజయకుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో పదే పదే వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. ఆమెపై సినీ ప్రముఖులతో పాటు పలువురి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తనపై విమర్శలు చేస్తోన్న వారికి వనిత ఘాటుగా సమాధానాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తనను, తన భర్తను విమర్శించిందంటూ ఆమెకు దర్శకురాలు లక్ష్మీ రామకృష్టన్ తన లాయర్ ద్వారా సమన్లు పంపింది. అంతేకాదు, వనితపై మరికొందరు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.  

కరోనా వ్యాప్తి పట్టించుకోకుండా, అనుమతులు తీసుకోకుండా వనిత ఓ వేడుక నిర్వహించిందని తమిళనాడులోని పెరంబూరు అయ్యప్పన్‌ తంగల్‌కు చెందిన అపార్ట్‌మెంట్ల సంఘం  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై పలువురు పెట్టిన కేసులపై వనిత తాజాగా స్పందించింది. వాటన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొంటానని ఆమె తెలిపింది. ఎల్లప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడే వారు అలాగే  ఉంటారని, వాటిని పట్టించుకోకూడదని వనిత చెప్పుకొచ్చింది.