గుండెపోటుతో కన్నుమూసిన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్

30-07-2020 Thu 06:27
  • కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోమెన్
  • ఈ తెల్లవారుజామున 1:30 సమయంలో కన్నుమూత
  • విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు
West Bengal Congress chief Somen Mitra passes away at 78

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ సోమెన్ మిత్రా ఈ తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ల ఈ సీనియర్ నేత చౌరంగీ జిల్లాలోని సీల్దా నియోజకవర్గం నుంచి 1972లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మిత్రా, ఆ తర్వాత ఏడు సార్లు ఆ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2008లో అభిప్రాయభేదాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మిత్రా, తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2009లో డైమండ్ హార్బర్ నియోజక వర్గం నుంచి టీఎంసీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, 2014లో తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.    

కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న మిత్రాను ఈ నెల మొదట్లో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితాలు నెగటివ్ వచ్చినట్టు వైద్యులు పేర్కొన్నారు. మిత్రాకు భార్య, కుమారుడు ఉన్నారు.

సోమెన్ మిత్రా మృతితో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతితో ఓ మంచి నాయకుడిని కోల్పోయినట్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు.. సోమెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.