ఆసుపత్రిలో చేరిన టీవీ నటుడు అనుపమ్‌కు సోనూసూద్ అండ.. సాయానికి హామీ

29-07-2020 Wed 20:54
  • కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న టీవీ నటుడు
  • ఆదుకోవాలంటూ దాతలను అభ్యర్థించిన అనుపమ్ సోదరుడు
  • సాయానికి ముందుకొచ్చిన సోనూ సూద్
bollywood actor sonu sood promise to help anupam shyam

కష్టం ఉందని తెలియగానే వాలిపోయే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరో సాయానికి సిద్ధమైపోయాడు. ఇప్పటికే ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి ప్రజలతో జేజేలు అందుకుంటున్న సోనూ సూద్.. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు.

 కిడ్నీ సంబంధిత సమస్యలతో రెండు రోజుల క్రితం అనుపమ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆర్థిక సాయం అందించాలంటూ అనుపమ్ సోదరుడు అనురాగ్ దాతలను అభ్యర్థించారు. ఇది చూసిన ఓ యూజర్ అనుపమ్‌ను ఆదుకోవాలంటూ సోనూసూద్‌ను ట్యాగ్ చేశాడు. ఇది సోనూ దృష్టికి చేరడంతో స్పందించాడు. అనుపమ్ కుటుంబానికి సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. కాగా, సోనూ సూద్ తన దాతృత్వ కార్యక్రమాలతో ఇప్పటి వరకు సుమారు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.