New National Education Policy: కొత్త జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.. కీలక అంశాలు ఇవే!

  • భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా చేయడమే లక్ష్యం
  • యాంత్రికంగా చదువుకునే విధానానికి ముగింపు
  • ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్ద పీట
Details of new National Education Policy

కొత్త జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్యాంశాల దగ్గర నుంచి ఎంఫిల్ డిస్ కంటిన్యుయేషన్ వరకు విద్యా విధానంలో మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను మార్చారు. విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించడం, భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు.

కొత్త జాతీయ విద్యా విధానంలో కీలక అంశాలు ఇవే:
* యాంత్రికంగా పాఠాలను చదువుకునే పద్ధతికి ముగింపు పలకడం. ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్ద పీట వేయడం.
* ఎంఫిల్ కోర్సులను నిలిపివేయడం.
* న్యాయ, వైద్య కళాశాలలు మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఒకే రెగ్యులేటర్ కిందకు తీసుకురావడం.
* యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు నూతన విద్యా విధానం ప్రకారం కామన్ ఎంట్రెస్ పరీక్షలను నిర్వహించడం.
* పాఠశాల పాఠ్యాంశాలను ప్రాధాన్యతా స్థాయికి తీసుకురావడం. 6వ తరగతి నుంచి వొకేషనల్ విద్యతో అనుసంధానం చేయడం.
* 2035 నాటికి హైస్కూల్ విద్యార్థుల్లో 50 శాతం మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా చేయడం.
* జీడీపీలో 6 శాతాన్ని విద్యకు కేటాయించాలని కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం జీడీపీలో 4 శాతాన్ని మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు.
* విద్యా సంస్థల ఫీజులకు ఒక పరిమితిని విధించడం.
* 2030 నాటికి ప్రాథమిక పాఠశాలల నుంచి సెకండరీ లెవెల్ స్కూళ్ల వరకు 100 శాతం స్థూల నమోదు నిష్పత్తి ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది.
* ఐదో తరగతి వరకు మాతృ భాష కూడా ఒక మీడియంగా ఉండాలని నిర్ణయించారు.
రిపోర్ట్ కార్డుల్లో మార్కులతో పాటు విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలను పేర్కొనడం.

ఈ సందర్భంగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖర్గే మాట్లాడుతూ, ఇప్పటి వరకు డీమ్డ్ యూనివర్శిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర యూనివర్శిటీలకు వివిధ నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అయితే, నాణ్యమైన విద్యను అందించే క్రమంలో... నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అన్ని విద్యా సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండబోతున్నాయని తెలిపారు.

More Telugu News