Rafale: భారత భూభాగాన్ని ముద్దాడిన రాఫెల్.. అద్భుతమైన వీడియో!

  • అంబాలా ఎయిర్ బేస్ కు చేరిన రాఫెల్ విమానాలు
  • మన మిలిటరీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న రక్షణ మంత్రి
  • మొత్తం 36 ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఆర్డర్ చేసిన భారత్
5 Rafale landed in Ambala

భారత వాయుసేన అమ్ములపొదిలోకి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. కాసేపటి క్రితం అంబాలాలోని ఎయిర్ బేస్ కు తొలి బ్యాచ్ లోని ఐదు జెట్ విమానాలు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ ఫైటర్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ గడ్డను ముద్దాడాయి. వీటికి మిలిటరీ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. 'గోల్డెన్ యారోస్'గా పిలిచే నెంబర్ 17 స్క్వాడ్రన్ లో ఇవి భాగం కానున్నాయి.

రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలాలో ల్యాండ్ అయిన వెంటనే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'లోహ విహంగాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. రాఫెల్ విమానాలు మన గడ్డను తాకిన క్షణం తర్వాత భారత మిలిటరీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. మన వాయుసేన శక్తి సామర్థ్యాలు ఈ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో మరింత పెరగనున్నాయి' అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.

మొత్తం 36 రాఫెల్ జెట్స్ కోసం ఫ్రెంచ్ ఏరో స్పేస్ దిగ్గజం 'డస్సాల్ట్ ఏవియేషన్'తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన విమానాలు విడతల వారీగా మనకు అందనున్నాయి. ప్రపంచంలోనే  అత్యంత వేగంగా, శత్రు విమానాలకు అందనంత సామర్థ్యంతో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా వద్ద కూడా ఇలాంటి యుద్ధ విమానాలు లేకపోవడం గమనార్హం.

More Telugu News