Bandi Sanjay: ఒవైసీ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి: బండి సంజయ్

Owaisis comments are against to constitution says Bandi Sanjay
  • అయోధ్య రామాలయం భూమిపూజకు మోదీ హాజరవుతుండటాన్ని ప్రశ్నించిన ఒవైసీ
  • రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని ప్రశ్నించిన సంజయ్
  • భూమిపూజలో మోదీ పాల్గొనడం చారిత్రక అవసరమని వ్యాఖ్య
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమిలో ఆయన మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చవకబారు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రామాలయం కేవలం హిందూ మతస్థులకు మాత్రమే చెందినది కాదని... ఇది భారతీయుల ఆలయమని చెప్పారు.

అయోధ్య రామాలయం భూమిపూజలో ప్రధాని హోదాలో మోదీ పాల్గొనడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఒవైసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లౌకిక వాదానికి ఇది తూట్లు పొడుస్తుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ, ఒవైసీ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.

కోట్లాది మంది ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమంలో మోదీ పాల్గొనడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని సంజయ్ అన్నారు. 400 ఏళ్లుగా అయోధ్యలో బాబ్రీ మసీదు ఉందనే విషయం నిజమైతే... అక్కడ ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రామాలయ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సర్వ మానవాళి సంక్షేమాన్ని కోరుకునే మోదీ... హిందూ మతానికి చెందిన వ్యక్తిగా, కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా, భూమి పూజలో పాల్గొనడం చారిత్రక అవసరమని అన్నారు. ఒవైసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు.
Bandi Sanjay
Narendra Modi
BJP
Asaduddin Owaisi
MIM
Ayodhya Ram Mandir

More Telugu News