మీరే విందుకు రండి: కాంగ్రెస్ నేత ప్రియాంకకు బీజేపీ ఎంపీ పిలుపు

28-07-2020 Tue 06:34
  • కేన్సర్‌కు చికిత్స చేయించుకుని వచ్చాను
  • వైద్యులు ఇంట్లోనే ఉండమన్నారు
  • మీరే మీ కుటుంబంతో కలిసి మా ఇంటికి డిన్నర్‌కు రండి
Come For Dinner BJP MPs Reply To Priyanka Gandhi Invite

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తేనీటి విందు ఆహ్వానంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బులానీ స్పందించారు. ప్రస్తుతం తాను కేన్సర్‌కు చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చానని, కాబట్టి తాను టీ తాగేందుకు రాలేనని, మీరే కుటుంబంతో కలిసి మా ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించారు. విందులో ఉత్తరాఖండ్ సంప్రదాయ వంటకాలను వండిపెడతానని హామీ ఇచ్చారు.


ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని 35 లోధీ ఎస్టేట్ బంగళాలోనే ఉంటున్నారు. ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో బంగళాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు నోటీసులు పంపింది. దీంతో ఆగస్టు 1 నాటికి ప్రియాంక బంగళాను ఖాళీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాను ఖాళీ చేయబోతున్న బంగళాలోకి రాబోతున్న అనిల్ బులానీని ప్రియాంక తేనీటి విందుకు ఆహ్వానించారు. భార్యతో కలిసి టీ తాగేందుకు రావాలని కోరారు.  

ప్రియాంక ఆహ్వానంపై స్పందించిన బులానీ.. కేన్సర్ చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నానని, వైద్యులు తనను ఇంట్లోనే ఉండమని సూచించారని పేర్కొన్నారు. కాబట్టి టీ పార్టీకి తాను రాలేనని, మీరు మీ కుటుంబంతో కలిసి తన ఇంటికి డిన్నర్‌కు రావాలని కోరారు. ఢిల్లీలోని లుటియెన్స్ బంగళాలోకి మారిన తర్వాత విందు ఇస్తానని బులానీ పేర్కొన్నారు.