మరో యువకుడితో సహజీవనం చేస్తున్నానంటూ భార్యకు చెప్పిన యువకుడు... పోలీసులను ఆశ్రయించిన యువతి

27-07-2020 Mon 21:20
  • గుంటూరులో ఘటన
  • తాను గే అని భార్యతో చెప్పిన యువకుడు
  • పెళ్లయిన మూడ్రోజులకు అమెరికా పయనం
Youth left his wife as he went for boyfriend

ఎన్నో ఆశలతో కొత్తకాపురంలోకి అడుగుపెట్టిన ఆ నవ వధువుకు మూడు రోజులకే భర్త గురించి భయంకరమైన నిజం తెలియడంతో కుప్పకూలింది. తన భర్త ఓ స్వలింగ సంపర్కుడని తెలియడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. పెళ్లయిన మూడ్రోజులకే భర్త నిజస్వరూపం బట్టబయలు కావడంతో ఆ యువతి గుంటూరు జిల్లా పోలీసులను ఆశ్రయించింది.

అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అతడికి లాంఛనాలు బాగానే అందాయి. అమ్మాయి తల్లిదండ్రులు రూ.50 లక్షల నగదుతో పాటు 50 సవర్ల బంగారం కూడా ముట్టచెప్పారు. ఇక శోభనం నాడు తన ఆరోగ్యం బాగాలేదని తప్పించుకున్న ఆ యువకుడు తర్వాత కూడా ఏదో ఒక కారణం చెబుతుండడంతో ఆ నవ వధువు నిలదీసింది. దాంతో అసలు విషయం చెప్పేశాడు.

తాను అమెరికాలో మరో యువకుడితో సహజీవనం చేస్తున్నానని, తాను స్వలింగ సంపర్కుడ్నని వెల్లడించాడు. దాంతో ఆ యువతికి గుండె పగిలినంత పనైంది. ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసిన ఆ యువకుడు అమెరికా వెళ్లిపోయాడు. దాంతో తాను మోసపోయానని భావించిన ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.