Alibaba group: చైనా వ్యాపార దిగ్గజం జాక్ మాపై మాజీ ఉద్యోగి కేసు.. గురుగ్రామ్ కోర్టు సమన్లు

  • ఉద్యోగం నుంచి తొలగించడంపై కోర్టుకెక్కిన యూసీ బ్రౌజర్ మాజీ ఉద్యోగి
  • రూ. 2 కోట్ల పరిహారం ఇప్పించాలని డిమాండ్
  • వార్తల సెన్సార్, ఫేక్‌న్యూస్‌ను తప్పుబట్టినందుకే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణ
Alibaba and Jack Ma Summoned By Gurgaon Court

చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా, ఆయన సంస్థ అలీబాబా గ్రూప్‌నకు గురుగ్రామ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఉద్యోగం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ అలీబాబా గ్రూప్‌నకు చెందిన యూసీ బ్రౌజర్ ఉద్యోగి పుష్పేంద్రసింగ్ పర్మార్ దాఖలు చేసిన వ్యాజ్యం మేరకు కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. తనను అకస్మాత్తుగా తొలగించినందుకు పరిహారంగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా ఆ పిటిషన్‌లో పుష్పేంద్ర పేర్కొన్నారు.

చైనాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను సెన్సార్ చేయడం, ఫేక్ న్యూస్‌ను ప్రదర్శించడాన్ని తను తప్పుబట్టినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. అలాగే, సామాజిక, రాజకీయ గందరగోళానికి గురిచేసే వార్తలనే యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్ ఎక్కువగా చూపిస్తున్నాయని పర్మార్ ఆరోపించారు. ఈ విషయంలో తాను అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్లే తనను అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారని పుష్పేంద్ర పేర్కొన్నారు.

పుష్పేంద్ర తరపు న్యాయవాది  అతుల్ అహ్లావత్ మాట్లాడుతూ..  ఈ నెల 20న గురుగ్రామ్ కోర్టులో పుష్పేంద్ర తరపున వ్యాజ్యం దాఖలు చేశామని, ఈ నెల 29న వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ హాజరవాలంటూ అలీబాబా గ్రూప్, జాక్ మాలను కోర్టు ఆదేశించిందని తెలిపారు. కాగా, సమన్లపై జాక్ మా ఇప్పటి వరకు స్పందించలేదని పేర్కొన్నారు.

More Telugu News