భారత శాస్త్రీయ నృత్యంతో కామెడీ చేయబోయి కంగుతిన్న కొరియా గాయని

26-07-2020 Sun 21:21
  • టిక్ టాక్ వీడియో చేసిన సన్మీ
  • ఇద్దరు డ్యాన్సర్లతో వీడియో
  • అవహేళన చేస్తున్నట్టుగా క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు
Korean Singer trolled after mocks Indian classical dance moves

దక్షిణ కొరియా గాయని లీ సన్ మీ అలియాస్ సన్మీ ఎంతో పాప్యులారిటీ అందుకుంది. ఆమె వీడియోలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే, అత్యుత్సాహంతో భారత శాస్త్రీయ నృత్యాన్ని అవహేళన చేస్తున్న రీతిలో ఓ టిక్ టాక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆపై తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది. సన్మీ ఇటీవల ఓ టిక్ టాక్ వీడియో చేసింది. అందులో ఆమెతో పాటు మరో ఇద్దరు డ్యాన్సర్లు కూడా ఉన్నారు. అయితే వారందరూ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులను ఇష్టంవచ్చినట్టు వేయడం ఆ వీడియోలో కనిపించింది.

అయితే, నిర్లక్ష్యపూరితమైన స్టెప్పులతో భారత శాస్త్రీయ నృత్యం పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ నెటిజన్లు వీరిపై విరుచుకుపడ్డారు. దాంతో సన్మీ వెంటనే తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరింది. ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలను అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది. కొన్ని దేశాల సంస్కృతుల గురించి తెలియకపోవడం తన అజ్ఞానమేనని అంగీకరించింది. అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని ట్విట్టర్ లో వెల్లడించింది.