Village: 40 రోజులుగా వీధి దీపాల్లేకుండా గడుపుతున్న గ్రామస్తులు.. ఎందుకో తెలుసా..?

  • వీధి లైట్ల స్విచ్ బోర్డులో గుడ్లు పెట్టిన పక్షి
  • స్విచ్ వేసేందుకు వెళుతుండడంతో పొదగలేకపోతున్న పక్షి
  • కొన్నిరోజులు స్విచ్ బోర్డు జోలికి వెళ్లకూడదని గ్రామస్తుల నిర్ణయం
A Village with no street lights for a cause

తమిళనాడులోని శివగంగై జిల్లాలో పొత్తక్కుడి అనే గ్రామం ఉంది. ఇది అన్ని గ్రామాల్లాంటిదే. అయితే ఇక్కడ గత 40 రోజులుగా వీధి దీపాలు వెలగడంలేదు. అందకు బలమైన కారణమే ఉంది. అసలేం జరిగిందంటే.... పొత్తక్కుడి గ్రామానికి చెందిన కరుప్పు రాజా అనే యువకుడు ప్రతిరోజూ సాయంత్రం వీధి దీపాలు వెలిగించే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఓ స్తంభానికి ఉండే మెయిన్ స్విచ్ బోర్డులో స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడమే అతడి డ్యూటీ. సాయంత్రం 6 గంటలకు ఆన్ చేసి ఉదయం 5 గంటలకు ఆఫ్ చేస్తుంటాడు. మొత్తం 35 వీధి లైట్లు ఆ స్విచ్ బోర్డుకు అనుసంధానం చేసి ఉన్నాయి.

ఒకరోజు కరుప్పు రాజా ఆ స్విచ్ బోర్డు ఉన్న బాక్సులోంచి ఓ చిన్న పక్షి బయటికి రావడం గమనించాడు. అది కొన్ని ఎండుపుల్లలు సేకరిస్తోంది. అదేం పక్షో తెలియకపోయినా, అది గూడు కడుతోందని గుర్తించాడు. ఆ తర్వాత పలుమార్లు కరుప్పు రాజా స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లగా, ఆ పక్షి పుల్లలు అక్కడే పడేసి వెళ్లిపోయేది. తన కారణంగానే అది గూడు కట్టుకోవడం మానేసి వెళ్లిపోతోందని కరుప్పురాజాకు అర్థమైంది.

ఆ తర్వాత రోజు స్విచ్ బోర్డు బాక్సులోకి పరీక్షగా చూడగా, అందులో మూడు చిన్న గుడ్లు కనిపించాయి. దాంతో అతడో నిర్ణయానికి వచ్చాడు. ఆ పక్షిని స్వేచ్ఛగా పొదగనిచ్చేందుకు వీలుగా, కొన్నిరోజుల పాటు వీధి లైట్ల స్విచ్ ఉన్న ఆ బోర్డు జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ గుడ్లు, ఆ పక్షి గూడును ఫొటో తీసి వాట్సాప్ లో గ్రామస్తులందరికీ షేర్ చేశాడు.

ఆ పక్షి తన గుడ్లు పొదిగి పిల్లలు చేసేవరకు స్విచ్ బోర్డు జోలికి వెళ్లకూడదని భావిస్తున్నట్టు తెలుపగా, గ్రామస్తులందరూ కరుప్పు రాజా నిర్ణయాన్ని స్వాగతించారు. మనస్ఫూర్తిగా సహకరిస్తామని తెలిపారు. దాని ఫలితమే నెలరోజులకు పైగా ఆ గ్రామంలో వీధిలైట్లు వెలగకపోయినా గ్రామస్తులేమీ ఇబ్బందిగా భావించడంలేదు. పైగా, సాటి ప్రాణుల పట్ల దయతో వ్యవహరించడంలో కరుప్పు రాజాను స్ఫూర్తిగా తీసుకుని ఆ పక్షి పొదిగేందుకు తమవంతు సాయం చేస్తున్నారు. స్థానిక అటవీశాఖ సిబ్బంది కూడా ఆ గ్రామస్తులను అభినందించారు.

More Telugu News