పీవీ నరసింహారావును మొట్టమొదటిసారి బహిరంగంగా కొనియాడిన సోనియా గాంధీ

24-07-2020 Fri 21:34
  • తెలంగాణలో పీవీ శతజయంతి వేడుకలు
  • తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసిన సోనియా, రాహుల్
  • దేశాన్ని గట్టెక్కించారంటూ కితాబు
Sonia Gandhi praises PV Narasimharao

ప్రస్తుతం తెలంగాణలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. పీవీ నరసింహారావును కీర్తిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ విభాగానికి లేఖలు రాశారు.

"రాష్ట్రంలోనూ, దేశంలోనూ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అనంతరం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో పీవీ ప్రధాని అయ్యారు. ధీరోదాత్తమైన ఆయన నాయకత్వంలో దేశం అనేక సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. ఆయన హయాంలో 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చివేసింది" అంటూ సోనియా తన లేఖలో ప్రస్తుతించారు. పీవీని సోనియా, ఆమె కుటుంబ సభ్యులు బహిరంగంగా కీర్తించడం ఇదే ప్రథమం అని చెప్పాలి.

90వ దశకంలో అనూహ్యరీతిలో ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావుతో సోనియా కుటుంబీకుల సంబంధాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. నెహ్రూ-గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి పూర్తిస్థాయిలో ప్రధాని బాధ్యతలు నిర్వర్తించింది పీవీతోనే సాధ్యమైంది. 1996 వరకు ప్రధానిగా ఉన్న పీవీ ప్రస్థానం ఏమీ నల్లేరుపై నడకలా సాగలేదు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను తట్టుకుంటూనే ఆయన ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయం పీవీకి విషమపరీక్ష వంటిదని చెప్పాలి. ప్రధానిగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదంటూ పరోక్షంగా అయోధ్యలో పరిస్థితికి ఆయనను బాధ్యుడ్ని చేశారు.