Ganta Srinivasa Rao: వైసీపీలో చేరే విషయమై ఇంకా స్పందించని గంటా శ్రీనివాస్!

  • గత రెండు రోజులుగా గంటాపై వార్తలు
  • గంటా చేరికను వ్యతిరేకిస్తున్న అవంతి వర్గం
  • త్వరలోనే నిర్ణయాన్ని వెలువరించనున్న గంటా
No Conformation from Ganta on Party Change

మాజీ మంత్రి, గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న ఉత్తరాంధ్ర టీడీపీ నేత గంటా శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గంటాను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధినేత జగన్ నుంచి అనుమతి లభించిందని కూడా తెలుస్తుండగా, ఈ విషయమై ఇప్పటికీ గంటా అధికారికంగా తన నోటి నుంచి ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడం గమనార్హం.

కాగా, విశాఖపట్నం ప్రాంతంలో పట్టున్న వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ తో గంటాకు గతం నుంచే కొన్ని విభేదాలు ఉండటంతోనే ఆయన చేరిక ఆలస్యం అవుతోందని సమాచారం. అవంతి సైతం గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం గంటాకు అలవాటేనని ఇటీవల బహిరంగ విమర్శలు కూడా చేశారు.

ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస్ ను సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. మరోమారు తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఆయన తన నిర్ణయాన్ని స్వయంగా వెల్లడిస్తారని గంటా శ్రీనివాస్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

More Telugu News