Lockdown: సినిమా థియేటర్లను ఇలా మారుస్తాం... దయచేసి అనుమతించాలని ప్రధానికి మల్టీప్లెక్స్ యాజమాన్యాల లేఖ!

Multiplex CEOs Letter to PMO on Movie Theaters Re Opening
  • లాక్ డౌన్ తో మూతబడిన సినిమా హాల్స్
  • ప్రేక్షకుల భద్రతకు పెద్దపీట వేస్తూ నిబంధనలు
  • థియేటర్లకు అనుమతించాలని సీఈఓల లేఖ
లాక్ డౌన్ కారణంగా మార్చిలో మూతపడిన సినిమా థియేటర్లు ఎప్పుడు తిరిగి తెరచుకుంటాయో, ఎవరూ చెప్పలేని పరిస్థితి వుంది. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండగా, ఆగస్టు నెలాఖరులోగా థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని పీవీఆర్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్ సీఈఓలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో థియేటర్లను నడిపించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి, వివిధ మంత్రిత్వ శాఖలకు లేఖను రాశారు. తాము థియేటర్లను ఈ కరోనా సమయంలో ఎలా నిర్వహిస్తామన్న విషయాన్ని తమ లేఖలో వివరించారు.

సినీ ప్రేక్షకులందరికీ మాస్క్ తప్పనిసరి చేస్తామని, శరీర ఉష్ణోగ్రతను చూసిన తరువాతనే లోపలికి అనుమతిస్తామని వారు తమ లేఖలో తెలిపారు. పేపర్ టికెటింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, డిజిటల్ మాధ్యమంగా టికెట్లను జారీ చేస్తామని, ఎస్‌ఎంఎస్, బార్ ‌కోడ్‌ స్కానింగ్‌ పద్ధతిని పాటిస్తామని తెలిపారు. ప్రతి సీటు మధ్యా ఖాళీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని, మల్టీప్లెక్స్ లలో ఒకేమారు రెండు సినిమాలు ప్రారంభం కాకుండా జాగ్రత్త పడతామని వెల్లడించారు. తద్వారా విశ్రాంతి సమయంలోనూ రద్దీ కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక, ప్రతి ప్రదర్శనకూ మధ్య అరగంట సమయం ఉండేలా చూసి, హాలు మొత్తాన్ని శానిటైజ్ చేస్తామని, ప్రేక్షకుల కోసం వీలైనన్ని ఎక్కువ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రేక్షకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, అటువంటి వాతావరణం కనిపించేలా చేస్తామని తెలిపారు. ఒకసారి పెద్ద సినిమా విడుదలైతే కనుక, ప్రేక్షకులు సినిమా హాల్స్ కు వస్తారనడంలో సందేహం లేదని తమ లేఖలో మల్టీప్లెక్స్ లు అభిప్రాయపడ్డాయి.

ఇండియాలో మూవీ థియేటర్ల వ్యాపారం ఏడాదికి దాదాపు రూ. 12 వేల కోట్ల వరకూ ఉంటుందని, అంటే సినిమా హాల్స్ మూసివేతతో నెలకు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించిన వారు, థియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతిస్తే, పరిస్థితి చక్కబడుతుందని అభిప్రాయపడ్డారు.
Lockdown
Movie Theaters
PMO
Multiplexs
Letter

More Telugu News