Shoaib Akhtar: అంతా డబ్బు కోసమే.... బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శలు చేసిన షోయబ్ అక్తర్

  • మంకీగేట్ వివాదాన్ని లేవనెత్తిన అక్తర్
  • బీసీసీఐ బెదిరింపులకు క్రికెట్ ఆస్ట్రేలియా తలొగ్గిందని ఆరోపణ
  • బీసీసీఐ డబ్బు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా పాకులాడుతోందని వ్యాఖ్యలు
Shoaib Akhtar fires on BCCI and Cricket Australia

కరోనా పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడం, ఆ టోర్నీ స్థానంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో స్పందించాడు. క్రికెట్ లో ఆర్థిక సమానత్వం లేకుండా పోయిందని వ్యాఖ్యానించాడు. జియో క్రికెట్ కార్యక్రమంలో భాగంగా ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ, బీసీసీఐ ఆర్థికంగా బలోపేతమైనది కావడంతో గతంలో వచ్చిన మంకీగేట్ వివాదాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పట్టించుకోకుండా వదిలేసిందని ఆరోపించాడు. ఇప్పుడు కూడా బీసీసీఐకి అనుకూలంగా ఐపీఎల్ కోసమే టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేశారన్న కోణంలో వ్యాఖ్యలు చేశాడు.  

2008 ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసీస్ ప్లేయర్ ఆండ్రూ సైమండ్స్ ను కోతి అన్నాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ వివాదం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పెద్దగా చర్యలు లేకుండానే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వివాదాన్ని ముగించింది. ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ బీసీసీఐకి మేలు చేకూర్చే నిర్ణయం తీసుకుందని క్రికెట్ ఆస్ట్రేలియాపై అక్తర్ ధ్వజమెత్తాడు.

"ఒకరు మరొకర్ని కోతి అని పిలుస్తారు. సిరీస్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతామని ఓ జట్టు బెదిరిస్తుంది. ఆస్ట్రేలియన్లను నేనడుగుతున్నాను... ఏమైపోయాయి మీ నైతిక విలువలు? నిన్నగాక మొన్న బంతిని గీకారంటూ ఆటగాళ్లపై తీవ్ర చర్యలు తీసుకున్నారు, కోతి అన్నవాడ్ని వదిలేశారు. సిరీస్ బాయ్ కాట్ చేస్తామని బీసీసీఐ బెదిరించగానే, అసలు అలాంటి సంఘటనే జరగలేదంటూ తేల్చేశారు. ఇదేనా మీ నైతిక ప్రవర్తన? ఇకనైనా ఈ డ్రామాలు కట్టిపెట్టండి, మాకు డబ్బే ముఖ్యమని చెప్పుకోండి. బీసీసీఐ నుంచి డబ్బు జాలువారుతుంటే క్రికెట్ ఆస్ట్రేలియా చక్కగా ఒడిసిపట్టుకుంటోంది. టి20 వరల్డ్ కప్ ను జరగనివ్వరని నేను ముందే చెప్పాను. వరల్డ్ కప్ ఏమైపోయినా ఫర్వాలేదు కానీ, ఐపీఎల్ కు మాత్రం నష్టం జరగకూడదు!" అంటూ అక్తర్ వ్యంగ్యం ప్రదర్శించాడు.

More Telugu News