బ్రిటన్ బ్యాంకులోని నిజాం సంపదపై లండన్ హైకోర్టు విస్పష్ట తీర్పు... వారసుల రివ్యూ పిటిషన్ కొట్టివేత!

23-07-2020 Thu 15:57
  • 1940 నుంచి నలుగుతున్న ఆస్తుల కేసు
  • ఆస్తి తమదేనంటూ వచ్చిన 120 మంది నిజాం వంశీకులు
  • నిజాం వంశస్తుల ఆరోపణలు కొట్టిపారేసిన లండన్ కోర్టు
London high court clarifies on Nizam assets case

గత ఏడు దశాబ్దాలుగా లండన్ బ్యాంకులో ఉన్న నిజాం పాలకులకు చెందిన రూ.332 కోట్ల (35 బిలియన్ పౌండ్లు) సంపద ఏడో నిజాం మనవళ్లయిన ముకరం జా, ముఫఖం జాలతో పాటు భారత ప్రభుత్వానికి చెందుతుందని లండన్ హైకోర్టు మరోసారి తేల్చిచెప్పింది.

ఈ ఆస్తిలో తమకు కూడా వాటా వస్తుందంటూ.. చివరి నిజాం మనవడు నజాఫ్ అలీ ఖాన్, మరో 120 మంది నిజాం వంశస్తులు వేసిన రివ్యూ పిటిషన్ పై నిన్న లండన్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్మిత్ తీర్పునిస్తూ పిటిషన్ ను కొట్టివేశారు.

వాస్తవానికి ఈ కేసు 1940 నుంచి లండన్ న్యాయస్థానంలో నలుగుతూనే ఉంది. నిజాంల సంపద తమకు చెందుతుందని పేర్కొంటూ.. చివరి నిజాం మనవడు నజాఫ్ అలీ ఖాన్, మరో 120 మంది నిజాం వంశస్తులు పిటిషన్ వేశారు. తమకూ చెందుతుందంటూ పాకిస్థాన్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.

అయితే సుదీర్ఘ విచారణ అనంతరం లండన్ హైకోర్టు గత ఏడాది అక్టోబర్లో తీర్పునిస్తూ, ఈ సంపదకు వారసులుగా నిజాంకు చెందిన ఇద్దరు మనవళ్లను, భారత ప్రభుత్వాన్ని పేర్కొంది. అయితే, దీనిపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్మిత్ చెబుతూ, ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి ఇప్పటికే తీర్పును ఇచ్చేశామనీ, మళ్లీ దీనిని సమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.