RBI: ఒత్తిడిలో వున్న రంగాలకు.. మరోమారు మారటోరియాన్ని పొడిగించే ఆలోచనలో ఆర్బీఐ!

  • ఇప్పటికే ఆరు నెలల మారటోరియం
  • ఆగస్టు 31తో ముగియనున్న సదుపాయం
  • ఇంకా కోలుకోని పలు రంగాలు
  • విమాన, ఆతిథ్య రంగాల్లో పొడిగించే ఆలోచన
  • వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ వర్గాలు
Maratorium May Be Extended by RBI

కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత తొలుత మూడు నెలల పాటు అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆపై దాన్ని మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పటికీ చాలా రంగాలు లాక్ డౌన్ ప్రభావం నుంచి బయటపడక పోవడంతో ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని, అయితే, అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే యోచన చేస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.

ఈ రంగాల్లో రుణాలు ఏ మేరకు ఉన్నాయి? తనఖా ఆస్తుల విలువెంత? తదితర అంశాలను మదిస్తున్న రిజర్వ్ బ్యాంక్, లాక్ డౌన్ సమయం నుంచి క్యాష్ ఫ్లో, రీ పేమెంట్స్ తదితర విషయాలనూ సమీక్షిస్తోంది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో సైతం ఆర్బీఐ అధికారులు చర్చలు జరిపారని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఇద్దరు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఇక స్టార్టప్ సంస్థలకు కూడా మరికొంతకాలం మద్దతుగా నిలవాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మరింత కాలం కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలోనే, మారటోరియాన్ని పొడిగించే యోచన చేస్తున్నట్టు సమాచారం.

కరోనా మహమ్మరి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో, ఎయిర్ లైన్స్ సెక్టార్, ఆతిథ్య రంగం అత్యధికంగా ప్రభావితం అయ్యాయని, ఈ రంగాలకు మరింత రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మరింతకాలం కొనసాగి, రవాణా సౌకర్యాలు తిరిగి పూర్వపు స్థితికి చేరకుంటే, ఎన్నో సంస్థలు మూసివేయక తప్పనిసరి పరిస్థితి నెలకొనివుంది. అదే జరిగితే, ఈ రంగాలపై ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతి పెద్ద మాంద్యమని నిపుణులు ఇప్పటికే అభివర్ణించారు.

ఇదిలావుండగా, వ్యక్తిగత రుణ గ్రహీతలకు మాత్రం మరోమారు మారటోరియం పొడిగింపు అవకాశాలు లేవని తెలుస్తోంది. చాలా రంగాలు తిరిగి తెరచుకోగా, వ్యక్తిగత రుణాలపై మారటోరియం పొడిగించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకుల నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం, ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలను తీసుకున్న వారిలో 29 శాతం, ఆర్థిక సేవల సంస్థలు ఇచ్చిన రుణాలు తీసుకున్న వారిలో 59 శాతం మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సరాసరిన 30.6 శాతం మంది రుణ గ్రహీతలు ఈఎంఐలను చెల్లించలేదు. ఈ మొత్తం విలువ సుమారు రూ. 2.83 లక్షల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

More Telugu News