Maoists: ఏవోబీలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్.. కొద్దిలో తప్పించుకున్న అగ్రనేత ఆర్కే!

Maoist top leader RK escapped from Encounter
  • చలపతి, ఆయన భార్య అరుణకు తీవ్ర గాయాలు
  • మావోలకు కలిసొచ్చిన భారీ వర్షం
  • గాయపడిన వారు లొంగిపోతే వైద్య సాయం అందిస్తామని పోలీసుల ప్రకటన
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కొద్దిలో తప్పించుకున్నాడు. అయితే, మరో అగ్రనేత, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి అమర వీరుల వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని మావోయిస్టులు నిర్ణయించారు. వారం రోజుల కార్యక్రమాల రూపకల్పన కోసం ఒడిశాలోని మల్కనగిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, కీలక మిలీషియా సభ్యులు పాల్గొన్నట్టు పోలీసులకు ఉప్పందింది.

గాలింపు మొదలుపెట్టిన పోలీసులకు ఈ నెల 16న ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కంటపడ్డారు. పోలీసులను చూడగానే అప్రమత్తమైన మావోలు కాల్పులు ప్రారంభించారు. ఆ వెంటనే పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. కాల్పులు జరుపుతూనే మావోలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఒడిశాలో తప్పించుకున్న మావోయిస్టులు ఇంజెరి అటవీ ప్రాంతంవైపు వెళ్తున్నట్టు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు అడవిలో జల్లెడ పట్టారు.

ఇంజెరిలో మొత్తం మూడు బృందాలుగా 30 మంది మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు చలపతి, అరుణ వంటి అగ్రనేతలు ఉన్న రెండో బృందంపై కాల్పులు జరిపారు. వారు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ మరోమారు తప్పించుకుపోయారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని గాలించగా రక్తపు మరకలు, తుపాకి, ఇతర సామగ్రి కనిపించాయి. ఈ కాల్పుల్లో చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్టు పోలీసులకు ఆ తర్వాత తెలిసింది.

ఆ తర్వాత మూడో బృందంపైనా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ బృందంలో అగ్రనేత ఆర్కే ఉన్నట్టు సమాచారం. అయితే, ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండడం మావోలకు కలిసొచ్చింది. దీంతో వారు తప్పించుకోగలిగారు. లేదంటే భారీ ఎన్‌కౌంటర్ జరిగి ఉండేదని భావిస్తున్నారు. మరోవైపు, గాయపడిన చలపతి, అరుణ ఎక్కువ దూరం వెళ్లి ఉండే అవకాశం లేకపోవడంతో ఏపీ, ఒడిశా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా, గాయపడిన మావోలు లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందించి, వారి ప్రాణాలు కాపాడతామని పోలీసులు తెలిపారు.
Maoists
RK
Chalapathi
Aruna
AOB
Andhra Pradesh
Odisha

More Telugu News