35 ఏళ్ల తర్వాత.. రాజా మాన్ సింగ్ హత్య కేసులో 11 మంది పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు!

21-07-2020 Tue 17:36
  • 1985లో రాజా మాన్ సింగ్ హత్య
  • రాజస్థాన్ కోర్టు నుంచి మథుర కోర్టుకు కేసును మార్చిన సుప్రీంకోర్టు
  • 1,700 వాయిదాలను విన్న కోర్టు
35 Years Later 11 Cops Convicted For Sensational Killing Of A Raja

1985 నాటి రాజా మాన్ సింగ్ హత్య కేసులో 11 మంది పోలీసులను మథుర కోర్టు దోషులుగా తేల్చింది. గత రెండు దశాబ్దాలుగా విచారిస్తున్న ఈ కేసుకు ముగింపు పలికింది. దోషులకు శిక్షను రేపు ఖరారు చేయనుంది.

కేసు వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్ లోని భరత్ పూర్ రాజవంశీకుడు రాజా మాన్ సింగ్ 1985 ఫిబ్రవరి 21న హత్యకు గురయ్యారు. ఈ హత్య అప్పట్లో రాజకీయ కలకలం రేపింది. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శివ్ చరణ్ మాథూర్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

హత్య గురించి మాన్ సింగ్ మనవడు దుష్యంత్ సింగ్ ఒక ప్రకటన ద్వారా స్పందించారు. '1985 అసెంబ్లీ ఎన్నికల్లో డీగ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజా మాన్ సింగ్ పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు భరత్ పూర్ సంస్థానం జెండాను అవమానపరిచారు. ఈ ఘటన మాన్ సింగ్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన వెంటనే చీఫ్ మినిస్టర్ ర్యాలీ జరుగుతున్న ప్రాంతానికి జీపులో వెళ్లారు. ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ను ధ్వంసం చేశారు. ఫిబ్రవరి 20న ఈ ఘటన జరిగింది.

ఆ మరుసటి రోజు తన ఇద్దరు అనుచరులతో కలిసి సరెండర్ కావడానికి రాజా మాన్ సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా... డీఎస్పీ కన్ సింగ్ భాటి నేతృత్వంలోని పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. రాజా మాన్ సింగ్ తో పాటు మిగిలిన ఇద్దరు కూడా స్పాట్ లోనే  చనిపోయారు' అని దుష్యంత్ తెలిపారు. మాన్ సింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత సీఎం రాజీనామా చేశారు.

ఈరోజు కోర్టు దోషులుగా ప్రకటించిన వారిలో అప్పటి డీఎస్పీ కన్ సింగ్ భాటి కూడా ఉన్నారు. తొలుత ఈ కేసును రాజస్థాన్ కోర్టు విచారించింది. రాజస్థాన్ లో కేసును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని భావించిన సుప్రీంకోర్టు...  ఆ తర్వాత కేసును ఉత్తరప్రదేశ్ లోని మథుర కోర్టుకు అప్పగించింది. కేసు కోసం 1,700 వాయిదాలను (హియరింగ్స్) మథుర కోర్టు వినడం గమనార్హం. హత్య జరిగిన 35 ఏళ్లకు కోర్టు జడ్జిమెంట్ ను ఇచ్చింది.

మరోవైపు ప్రస్తుత రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై కూడా ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ వర్గీయుడైన ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ సాక్షాత్తు రాజా మాన్ సింగ్ మేనల్లుడు కావడం గమనార్హం. ఈయనపై కూడా కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది.