నేను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కారణం ఇదే: ఢిల్లీ ఆరోగ్య మంత్రి వివరణ

21-07-2020 Tue 15:07
  • ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రపంచ స్థాయిలో ఉన్నాయి
  • నాకు ప్లాస్మా ట్రీట్మెంట్  ఇవ్వాల్సి వచ్చింది
  • అప్పటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దానికి పర్మిషన్ లేదు
Delhi Health Minister On Why He Was Moved To Private Hospital For Covid

కరోనా బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రపంచ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ప్లాస్మా థెరపీ కోసమే తాను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

తనకు కరోనా వచ్చిన వెంటనే ప్రభుత్వానికి చెందిన రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరానని... అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ఆ ఆసుపత్రి చాలా మెరుగైనదని సత్యేందర్ చెప్పారు. అయితే అక్కడ క్రమంగా తన పరిస్థితి విషమిస్తూ వచ్చిందని... దీంతో తనకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారని... అయితే దానికి అనుమతులు లేవని తెలిపారు. పర్మిషన్ కోసం తాను ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత 10 రోజులకు సీపీటీ ఇచ్చేందుకు మన ఆసుపత్రులకు పర్మిషన్ వచ్చిందని తెలిపారు. నాలుగు రోజుల క్రితం వరకు కూడా తాను ఆక్సిజన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

జూన్ 17న సత్యేందర్ జైన్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్రమైన జ్వరం, సడన్ గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో ఆయనను రాజీవ్ గాంధీ ఆసుప్రతి నుంచి మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నారు. ప్లాస్మా థెరపీ తర్వాత ఆయన కోలుకున్నారు. సీపీటీ తర్వాత రెండు రోజులకు ఆయనను ఐసీయూ నుంచి బయటకు తరలించారు. ఆ తర్వాత వారం రోజులకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.