Vidya Rani: మా నాన్న మృతదేహాన్ని కూడా సరిగా చూడలేకపోయాను: స్మగ్లర్ వీరప్పన్ కూతురు, బీజేపీ నేత విద్య

  • బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె
  • జీవితంలో ఏనాడూ తండ్రిని కలుసుకోలేకపోయానని భావోద్వేగం
  • బీఏ ఎల్ఎల్ బీ చదివి న్యాయవాద వృత్తి ఎంచుకున్న విద్య
Vidya about her father slain smuggler Veerappan

ఇటీవల తమిళనాడు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన విద్యా వీరప్పన్ తన తండ్రి వీరప్పన్ గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. గంధపుచెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ గా వీరప్పన్ చరిత్ర దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. తాజాగా, బీజేపీలో రాష్ట్రస్థాయి పదవి అందుకున్న విద్య మీడియాతో టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రీ కేజీ నుంచి తాను హాస్టల్లోనే పెరిగానని తండ్రితో అనుబంధమన్నదే తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే సాధారణ ప్రజల నుంచి ఆయన గురించి ఎన్నో మంచి విషయాలు వినేదాన్నని వెల్లడించారు. తాను ఏనాడూ తన తండ్రి వీరప్పన్ ను కలుసుకోలేదని, చివరికి ఆయన మృతదేహాన్ని సైతం ఆదరాబాదరాగా చూడాల్సి వచ్చిందని విద్య కంటతడి పెట్టుకున్నారు. కనీసం ఆయన మృతదేహాన్ని ఒక్కరోజైనా ఇంటి వద్ద ఉంచుకునే వీల్లేకుండా పోయిందని తీవ్ర బాధను వ్యక్తం చేశారు. తన తండ్రి జీవితంలోకి తొంగిచూసి ఏది తప్పు, ఏది ఒప్పు, ఆయన ఎలాంటివాడు అనేది తెలుసుకోలేకపోయానని వివరించారు.

సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న వాక్కులనే పాటించానని వివరించారు. స్కూల్లో టీచర్లు, సిస్టర్లు తనను తీర్చిదిద్దారని, వాళ్లే లేకుంటే తన జీవితం ఇప్పట్లా కాకుండా వీరప్పన్ కూతురిగా మరోలా ఉండేదని విద్య తెలిపారు. తన ఎదుగుదలకు చదువే ముఖ్యకారణమని ఆమె స్పష్టం చేశారు. బీఎ ఎల్ఎల్ బీ చదివి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న విద్య కృష్ణగిరిలో ఓ స్కూల్ స్థాపించి పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

More Telugu News