అసభ్య పదజాలంతో నన్ను వేధిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే అనిత

20-07-2020 Mon 21:00
  • పేటీఎం బ్యాచ్ అసభ్యంగా ట్రోల్ చేస్తోంది
  • వైసీపీ నాయకురాలే ఆత్మహత్యాయత్నం చేశారు
  • ఇంత జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు
PAYTM batch is harassing me says Anitha

సోషల్ మీడియాలో తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ అసభ్యంగా తనను ట్రోల్ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం పోయిందని... అందుకే, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సాక్షాత్తు మహిళా కమిషన్ చెప్పిన కేసులను కూడా పోలీసులు నమోదు చేయడం లేదని విమర్శించారు.

వైసీపీ సీనియర్ నేతల కారణంగా ఆ పార్టీ నాయకురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారని... మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ... మహిళలకు న్యాయం జరగడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం రాఖీ పౌర్ణమి రోజైనా దిశ చట్టానికి చట్టబద్ధతను కల్పించాలని అన్నారు.