Raghurama Krishnaraju: అప్పుడు ఆయనకు వచ్చిన పరిస్థితే ఇప్పుడు నాకొచ్చింది: రఘురామకృష్ణరాజు

  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు
  • అప్పట్లో జగన్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారని వెల్లడి
  • రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నారని వివరణ
Raghurama Krishnaraju comments on ongoing situtaions

ఏపీలో వైసీపీ హైకమాండ్ కు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనకు బెదిరింపులు వస్తున్నాయని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ రఘురామకృష్ణరాజు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఇప్పటికే లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రిని కలిసి రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రక్షణ లేదు కాబట్టి, కేంద్ర బలగాలతో రక్షణ కోరుతున్నానని తెలిపారు.

ప్రభుత్వాలు మారినా పోలీసులు వారే ఉంటారని, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ కూడా పోలీసులపై నమ్మకం లేదన్నారని, అప్పుడు ఆయనకు వచ్చిన పరిస్థితే ఇప్పుడు తనకు వచ్చిందని భావిస్తున్నానని రఘురామకృష్ణరాజు తెలిపారు. కాగా, తాను కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దానిపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగిందని వెల్లడించారు. ఐబీ నివేదికలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందని, రెండు వారాల్లోగా ఐబీ నివేదికలన్నీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించండి అంటూ హైకోర్టు కేంద్రానికి నిర్దేశించిందని రఘురామకృష్ణరాజు వివరించారు.

More Telugu News