విజయసాయిరెడ్డిని కలిసినా న్యాయం జరగలేదంటూ.. విషం తాగిన వైసీపీ మహిళా నేత!

20-07-2020 Mon 14:00
  • పార్టీ నేతలు తనను మోసం చేశారన్న జోని కుమారి
  • కరోనా వల్ల జగన్ ను కలవలేకపోతున్నానని ఆవేదన
  • మీడియా సమావేశంలోనే విషం తాగిన వైనం
YSRCP leader Joni Kumari attemps suicide in press meet

వైసీపీ నాయకురాలు, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. తన సమస్యలను పరిష్కరించాలంటూ ఈ ఉదయం విజయవాడలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలు తనను మోసం చేశారని, తనకు జరిగిన అన్యాయాన్ని విజయసాయిరెడ్డికి చెప్పుకున్నా న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి చెప్పుకునే  అవకాశం తనకు రాలేదని చెప్పారు.

పార్టీని సొంత కుటుంబంలా భావించానని... అయినా పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు తనను మోసం చేశారని తెలిపారు. 6వ తేదీన విజయసాయిరెడ్డిని కలిసి తన బాధను చెప్పుకున్నానని... అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూనే ఆమె విషం తీసుకున్నారు. వెంటనే ముందున్న టేబుల్ పై తల వాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.