ఏపీ గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేశ్ అరగంట పాటు భేటీ

20-07-2020 Mon 12:14
  • హైకోర్టు సూచనలతో భేటీ
  • తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరిన నిమ్మగడ్డ
  • గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేత
nimmagadda meets governer

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తనను తొలగిస్తూ‌ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించట్లేదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయగా, ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ విషయంపై తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ రోజు ఉదయం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా మళ్లీ నియమించాలని ఆయనకు విజ్ఞాపన పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు, తదితర అంశాలపై గవర్నర్‌తో ఆయన అరగంట పాటు మాట్లాడి వెళ్లారు. ఆయనను తిరిగి ఎస్‌ఈసీగా నియమించడంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.