Corona Virus: ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ రాకపోతే పరిస్థితి మరింత ఘోరం: లజార్డ్స్ సర్వే

  • జులై కంటే ముందు వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశాల్లేవు
  • వచ్చే ఏడాది మధ్య వరకు, ఆ తర్వాత కూడా వైరస్ విజృంభించే అవకాశం
  • లజార్డ్స్ గ్రూప్ సర్వేలో వెల్లడి
Globel Health care leaders survey on corona virus

ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుక రాకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ లీడర్స్‌ స్టడీ ఆందోళన వ్యక్తం చేసింది. టీకా కనుక అందుబాటులోకి రాకుంటే వచ్చే ఏడాది మధ్య వరకు, ఆ తర్వాత కూడా కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది జులై కంటే ముందుగా వ్యాక్సిన్ విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలులేవని సర్వేలో పాల్గొన్న ఆరోగ్య పరిరక్షణ రంగ నిపుణుల్లో నాలుగింట మూడొంతుల మంది అభిప్రాయపడ్డారు.

 గ్లోబల్ హెల్త్ కేర్  స్టడీ-2020 పేరిట లజార్డ్స్ హెల్త్ కేర్ గ్రూప్ నిర్వహించిన ఈ సర్వేలో ‘హెల్త్ కేర్ పరిశ్రమలు: కోవిడ్ మహమ్మారికి సంబంధించిన దీర్ఘ, స్వల్పకాలికంగా ఎదురవుతున్న సవాళ్లు, ఇబ్బందులు, ఆశిస్తున్న ప్రయోజనాల’పై లోతుగా విశ్లేషించారు. మే నెల చివరి నుంచి జూన్ ప్రథమార్థం వరకు ప్రపంచంలోని బయో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, డయాగ్నిస్టిక్స్, హెల్త్ కేర్ సర్వీసెస్‌కు చెందిన 184 మంది సి-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు, 37 మంది ఇన్వెస్టర్ల అభిప్రాయాలను సేకరించారు.

వీరిలో పెద్ద ఆరోగ్య పరిరక్షణ పరిశ్రమలు, వివిధ స్థాయుల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వచ్చే ఏడాది మధ్యనాటికి కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వీరిలో మెజారిటీ సభ్యులు పేర్కొన్నట్టు లజార్డ్స్ హెల్త్‌కేర్ గ్రూప్ గ్లోబల్ హెడ్ డేవిడ్ గ్లూక్‌మాన్ తెలిపారు.

మహమ్మారి సమసిపోతుందని 52 శాతం మంది, ఆర్థిక రంగం తిరిగి పుంజుకుంటుందని 45 శాతం మంది అభిప్రాయపడగా, వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. రోగులను ప్రత్యక్షంగా కంటే ఇతర మాధ్యమాల ద్వారా పరిశీలించడం పెరుగుతుందని 35 శాతం మంది చెప్పారు. మహమ్మారి అంతమయ్యాక ప్రజల్లో తమపై మంచి అభిప్రాయం పెరుగుతుందని 50 శాతం మంది బయో ఫార్మా ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.

More Telugu News