ITBP: చైనా భాష నేర్చుకుంటున్న భారత జవాన్లు!

  • ఐటీబీపీ జవాన్ల కోసం చైనా భాషలో ప్రత్యేక కోర్సు
  • సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న 90 వేల జవాన్లు
  • ఇప్పటి వరకు పోస్టర్లపై చైనా భాషలో రాసి చూపించే విధానం
ITBP jawans set to be learn China language

సుదీర్ఘకాలంగా పక్కలో బల్లెంలా ఉన్న చైనాతో మరింత కఠినంగా వ్యవహరించాలని భారత అధినాయకత్వం భావిస్తోంది. సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు తక్షణమే నిర్ణయం తీసుకునేలా కేంద్రం సైన్యానికి స్వేచ్ఛనిచ్చింది. అంతేకాదు, సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) జవాన్లకు చైనా భాష మాండరిన్ నేర్పాలని భావిస్తోంది.

ఐటీబీపీలో 90,000 మంది వరకు సైనికులు ఉన్నారు. వీరందరికీ చైనా భాష నేర్పడం ద్వారా సరిహద్దుల్లో చైనా బలగాలతో వివాదాలప్పుడు నేరుగా మాట్లాడేందుకు వీలవుతుందన్నది భారత్ యోచన. ఇప్పటివరకు చైనా బలగాలతో మనవాళ్లు ఏదైనా మాట్లాడాల్సి వస్తే పోస్టర్లపై చైనా భాషలో రాసి చూపేవారు. అదే చైనా భాష నేర్చుకుంటే ఈ సమస్య ఉండదని, చైనా సైనికులు చెప్పేది విని వెంటనే నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే 'ని హావో' (నమస్కారం), 'హుయ్ కు' (తిరిగి వెళ్లు) వంటి చిన్న చిన్న పదాలు ఐటీబీపీ జవాన్లకు తెలుసు. అయితే పూర్తిస్థాయిలో సంభాషించేందుకు అ పరిజ్ఞానం సరిపోదని భావించిన ఐటీబీపీ అధికారులు సమగ్రమైన కోర్సు సిద్ధం చేస్తున్నారు. అయితే, మనవాళ్లు చైనా భాష నేర్చుకోవడం వల్ల తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉందన్నది రక్షణ రంగ నిపుణుల ఆలోచన. మాటకు మాట చెప్పడం వల్ల గొడవలు చెలరేగుతాయని, ఇది కొంచెం ఇబ్బందికరమేనని నిపుణులు అంటున్నారు.

More Telugu News