సోషల్ మీడియాలో మోదీ ప్రభంజనం.... ట్విట్టర్ లో 60 మిలియన్ల ఫాలోవర్లు

19-07-2020 Sun 15:59
  • అత్యధికులు ఫాలో అవుతున్న భారతీయుడిగా మోదీ రికార్డు
  • అంతర్జాతీయ స్థాయిలో మోదీకి మూడో స్థానం
  • అగ్రస్థానంలో బరాక్ ఒబామా
PM Modi gets sixty million followers on Twitter

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎంత క్రియాశీలకంగా ఉంటారో తెలిసిందే. దాదాపు అన్ని విషయాలపైనా ఆయన స్పందిస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలపైనే కాకుండా, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ తదితర అంశాలపైనా పోస్టులు చేస్తూ నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 మిలియన్లు దాటింది. ట్విట్టర్ లో అత్యధికులు ఫాలో అవుతున్న భారతీయుడు ప్రధాని మోదీనే.

మోదీ 2009లో ట్విట్టర్ ను ఉపయోగించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నారు. అక్కడినుంచి ఆయన ప్రాభవం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2014 నాటికే సోషల్ మీడియాలో ఆయన ప్రభావం పెరిగింది. కాగా, ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నవారి జాబితాలో మోదీ మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 120 మిలియన్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 83 మిలియన్ల మందితో రెండో స్థానంలో ఉన్నారు.