యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ.. కాంగ్రెస్ నేత ప్రకటన!

18-07-2020 Sat 20:04
  • ప్రియాంకను సీఎం అభ్యర్థిగా నిర్ణయించామన్న జితిన్ ప్రసాద
  • ఇది కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్ అని వ్యాఖ్య
  • యూపీలో ప్రభుత్వ పనితీరు బాగోలేదు
Priyanka Gandhi will be UP CM candidate

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే క్రమంలో ప్రియాంకా గాంధీ చరిష్మాను వాడుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రియాంక పేరును అధిష్ఠానం ఫైనల్ చేసిందని... హైకమాండ్ నిర్ణయం పట్ల ప్రియాంక కూడా సానుకూలతను తెలియజేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద ఈరోజు తెలిపారు.

ప్రియాంకను సీఎం అభ్యర్థిగా తీసుకురావాలనేది కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్ అని... ఇప్పుడు అదే నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా తీసుకుందని జితిన్ ప్రసాద చెప్పారు. యూపీలో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని... అందుకే కాంగ్రెస్ పై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రియాంకను ట్విట్టర్ లీడర్ గా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, యూపీలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం సిద్ధమైందని, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు.