సంకీర్ణ ప్రభుత్వం దానికదే కుప్పకూలుతుంది: అమిత్ షాతో భేటీ తర్వాత ఫడ్నవిస్

18-07-2020 Sat 13:41
  • మహా సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయి
  • షుగర్ కంపెనీల గురించి అమిత్ షాతో మాట్లాడాను 
  • ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు 
No Operation Lotus in Maharashtra says Fadnavis

మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం లేదని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలు ఉన్నాయని... ఈ విభేదాలతోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఫడ్నవిస్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమిత్ షాతో జరిగిన భేటీ రాజకీయపరమైనది కాదని చెప్పారు. మహారాష్ట్రలో షుగర్ ఇండస్ట్రీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరడానికి అమిత్ షాను కలిశానని తెలిపారు.

మహారాష్ట్రలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని ఫడ్నవిస్ అన్నారు. కరోనాపై పోరాటమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితిని అమిత్ షాకు వివరించానని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలోనే అమిత్ షా తో భేటీ అయ్యారనే వార్తలను ఆయన ఖండించారు. అలాంటిదేమీ జరగడం లేదని చెప్పారు.