Kerala: కరోనా సామూహిక వ్యాప్తి మొదలైపోయింది: కేరళ ముఖ్యమంత్రి

  • తిరువనంతపురం సమీపంలో ఆందోళన
  • ఓ గ్రామంలోని 97 శాంపిల్స్ లో 51 పాజిటివ్ లు
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న పినరయి విజయన్
Corona Community Spread Started in Kerala says Pinarai

ఇండియాలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ మేరకు సంచలన ప్రకటన చేస్తూ, తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో  గత కొన్ని రోజులుగా వైరస్ సూపర్ స్ప్రెడ్డర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.

కాగా, కేరళలో మరోసారి కరోనా కరాళ నృత్యం మొదలైంది. తొలి కేసు కేరళలోనే నమోదైన సంగతి తెలిసిందే. ఆపై ప్రభుత్వం తీసుకున్న కట్టడి చర్యలు ఫలితాలను ఇచ్చాయి. కేసుల సంఖ్య తగ్గిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు తిరిగి రోజువారీ కేసుల సంఖ్యలో మరో రికార్డు నమోదైంది. దీంతో ముందు జాగ్రత్తగా మరిన్ని ట్రీట్ మెంట్ సెంటర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కేరళలోని ప్రతి జిల్లాలోనూ కేసులు ఉన్నాయి. రాజధాని తిరువనంతపురంలో అత్యధికంగా, ఆపై వాణిజ్య కేంద్రమైన ఎర్నాకులంలో కేసులు అధికంగా ఉన్నాయి.

ప్రస్తుతం కేరళలో 6 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 42 కేసుల విషయంలో వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ఇప్పటికీ తెలియకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఈ విషయాన్ని వెల్లడించిన పినరయి విజయన్, తిరువనంతపురంలో కరోనా కట్టడికి ఈ నెల 6 నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు.

"పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరిశీలించగా, 51 మందికి, పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తిరువనంతపురంలో పరిస్థితి భయాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ నిజంగానే చాలా వేగంగా విజృంభిస్తోంది. ఇక్కడి తీర ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించి, ప్రత్యేక పోలీసు టీమ్ లను, పౌర సేవల విభాగాన్ని రంగంలోకి దించాం. వారు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు" అని విజయన్ వ్యాఖ్యానించారు.

More Telugu News