యడియూరప్ప ఇంటిముందు కరోనా రోగి హల్ చల్!

17-07-2020 Fri 11:34
  • భార్యా బిడ్డలతో కలసి వచ్చి నినాదాలు
  • ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదంటూ కేకలు
  • స్పందించి హాస్పిటల్ లో చేర్చిన అధికారులు
Man Hulchul Near Yedyurappa House

కరోనా సోకిన ఓ వ్యక్తి, ఆసుపత్రిలో తనకు బెడ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, కర్ణాటక సీఎం యడియూరప్ప ఇంటి ముందు హల్ చల్ చేయడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సిఎం ఇంటి ముందుకు వచ్చాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, తన కుమారుడికి కూడా జ్వరం వస్తోందని పెద్దగా అరిచాడు. తనకు కరోనా సోకిందని వైద్యులకు చెప్పినా, తనకు బెడ్ ను ఇవ్వలేదని కేకలు పెట్టాడు. ముఖ్యమంత్రి తనకు సాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన తరువాత అతని కుటుంబాన్ని ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ విషయమై తన కార్యాలయ అధికారులను యడియూరప్ప వివరాలను అడిగారు. ఈ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లకుండా, నేరుగా సీఎం ఇంటి వద్దకు వచ్చాడని, వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేకపోవడంతోనే అతను ఇలా చేశాడని, ఇంటి వద్దకు అంబులెన్స్ తెప్పించి, అతన్ని తరలించామని అధికారులు తెలిపారు. కాగా, కర్ణాటకలో కరోనా మరింతగా విజృంభిస్తుండగా, కేసులు పెరుగుతున్న కొద్దీ, ఆసుపత్రులలో బెడ్స్ నిండుకుంటున్నాయి. దీనిపై పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.