Telangana: జీహెచ్ఎంసీ పరిధిని దాటిన కరోనా.. జిల్లాల్లోనూ భారీగా నమోదవుతున్న కేసులు

Covid Cases Crossed 40 Thousand Mark In Telangana
  • నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,676 కేసుల నమోదు
  • రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ అత్యధిక కేసుల నమోదు
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,22,693 నమూనాలు సేకరణ
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,676 కేసులు నమోదయ్యాయి. ఇక ఎప్పటిలానే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటి వరకు జిల్లాల్లో ఓ మాదిరిగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్‌లో 160, కరీంనగర్‌లో 92, నల్గొండలో 64, సంగారెడ్డిలో 57, వరంగల్ అర్బన్‌లో 47, నాగర్ కర్నూలులో 30, వనపర్తిలో 51, మెదక్‌లో26 సూర్యాపేట జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 41,018 కేసులు నమోదు కాగా, వీటిలో 13,328 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,295కి పెరిగింది. కరోనా బారినపడిన 10 మంది నిన్న మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 396కు పెరిగింది. తెలంగాణలో కోలుకుంటున్న వారి శాతం 67 శాతం ఉండడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,22,693 నమూనాలు పరీక్షించగా, నిన్న 14,027 శాంపిళ్లు పరీక్షించారు.
.
Telangana
Corona Virus
GHMC
Ranga Reddy District

More Telugu News