Madanapalli: సెటిల్ చేసుకుంటామని చెప్పారు.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: జడ్జిపై దాడి ఘటనపై డీఎస్పీ స్పందన

  • జడ్జి ఫోన్ చేసిన వెంటనే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు
  • రాజీ చేసుకుంటాం.. ఎఫ్ఐఆర్ వద్దని చెప్పారు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారు
Madanapalli DSP responds on Judge allegations

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో నివాసం ఉంటున్న జడ్జి రామకృష్ణపై దాడి జరిగినట్టు వార్తలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి స్పందించారు. మంగళవారం ఉదయం తనపై దాడి జరిగిందంటూ 100 నంబర్ కు జడ్జి ఫోన్ చేశారని... వెంటనే బి.కొత్తకోట పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి పరిస్థితిని విచారించారని చెప్పారు. స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని కోరారని తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో జడ్జితో పాటు రిటైర్డ్ వీఆర్వో వెంకటరెడ్డిని పిలిపించి పోలీసులు విచారించారని డీఎస్పీ చెప్పారు. అయితే తాము మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటామని... ఎఫ్ఐఆర్ వద్దని జడ్జి చెప్పారని తెలిపారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. ఆ తర్వాత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై దాడి జరిగిందని... పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ఆరోపించారని... ఇందులో వాస్తవం లేదని అన్నారు. మరోవైపు, జడ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మంది మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశామని చెప్పారు. వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్జి రామకృష్ణపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. 

More Telugu News