Cows: 'సింహాచలం గోశాల నుంచి 50 ఆవులు మాయం' అంటూ వార్తలు... స్పందించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి!

  • గోవులను పాత గోశాలకు తరలించినట్టు వెల్లడి
  • వైద్యుల సూచన మేరకు చర్యలు తీసుకున్నామని వివరణ
  • అసత్య ప్రచారం చేస్తే చర్యలుంటాయని హెచ్చరిక
Minister Vellampalli responds on Cows disappeared news

విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో ఉన్న గోశాల నుంచి ఒక్కసారిగా 50 ఆవులు మాయం అయ్యాయి అంటూ కథనాలు రావడంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. గోశాలకు మూడు రోజుల కిందట దాతలు కొన్ని గోవులను దానం చేశారని, ఈ గోవులను పరీక్షించిన పశువైద్యుల సూచన మేరకు వాటిని పాత గోశాలకు తరలించామని వివరణ ఇచ్చారు. దీనిపై కొందరు వక్రీకరించి ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తూ పవిత్ర గోశాల, ఆలయ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

రెండ్రోజుల కిందట గోశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని, ఆ వెంటనే ఆవులు మాయం అయ్యాయని ప్రచారం జరిగింది.  దీనిపై మంత్రి మాట్లాడుతూ,  దేవస్థానం పరిపాలన విధానంలో భాగంగా కాంట్రాక్టు ముగిసిన తర్వాత అర్హులైన వారికి మరికొందరికి ఔట్ సోర్సింగ్ ద్వారా అవకాశం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలకు తావులేదని అన్నారు. అయినా, గోశాల గోడ కూల్చి గోమాతలకు నిలువు నీడ లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో గోవుల పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు.

More Telugu News