RIL: రిలయన్స్ ఏజీఎంలో తొలిసారి మాట్లాడిన నీతా అంబానీ

  • డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను చేపడతాం
  • స్వచ్ఛందంగా ఆ బాధ్యతను తీసుకుంటాం
  • అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలన్న నీతా అంబానీ
Nita Ambani First Time Speach in RIL AGM

ఇండియాలో కరోనాకు వ్యాక్సిన్ తయారైతే దేశంలోని అన్ని ప్రాంతాలకు దాన్ని అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ చర్యలు తీసుకుంటుందని ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ వెల్లడించారు. నిన్న ముంబయిలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో నీతా అంబానీ తొలిసారిగా ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ పూర్తి సహకారాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారు. ఐకమత్యమే మన బలమని, అందరమూ కలసి కృషి చేస్తే, కరోనాను తరిమేయవచ్చని తెలిపారు.

వ్యాక్సిన్ బయటకు వస్తే, దాన్ని నలుమూలలకూ చేర్చే బాధ్యతను తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్, సరఫరా వ్యవహారాలను తాము స్వచ్ఛందంగా చేస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేసేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటామని అన్నారు. కరోనా మహమ్మారితో మనం చేస్తున్న పోరాటం ముగియలేదని, సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలని నీతా అంబానీ సూచించారు. కొవిడ్ టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు జియో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.

కరోనా మహమ్మారి ఇండియాకు విస్తరించగానే, దేశంలో పీపీఈ కిట్ల కొరత ఉందని రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ రిటైల్ గుర్తించాయని, ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, లక్ష పీపీఈ కిట్లను తయారు చేశామని, ఎన్-95 మాస్క్ ల ఉత్పత్తిని పెంచామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు అందిస్తున్న వాహనాలకు ఉచితంగా ఇంధనాన్ని రిలయన్స్ అందిస్తోందని తెలిపారు. 30 వేలకు పైగా సంస్థలు, 40 కోట్ల మందికి డిజిటల్ కనెక్టివిటీని అందించామని అన్నారు.

భారత క్రీడాకారులు అంతర్జాతీయ యవనికపై సత్తా చాటాలన్నది తమ కలని వెల్లడించిన నీతా అంబానీ, ఒలింపిక్స్ పోటీలను ఇండియాకు తీసుకుని రావాలని కూడా కలలు కంటున్నట్టు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 2.15 కోట్ల మంది చిన్నారులకు విద్యను దగ్గర చేశామని అన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికి పది సంవత్సరాలు అయిందని, ఈ పదేళ్ల వ్యవధిలో తాము  దేశ నలుమూలల్లోని 3.60 కోట్ల కుటుంబాలకు దగ్గరయ్యామని వెల్లడించారు. వచ్చే పదేళ్లలో తదుపరి తరంగా ఈషా ఆమె టీమ్, ఫౌండేషన్ కార్యకలాపాలను పదింతలు పెంచుతుందన్న నమ్మకం తనకుందని తెలిపారు.

More Telugu News