బాటిల్‌లో పెట్రోలు పొయ్యబోమన్న బంక్ సిబ్బంది.. కోపంతో బంకులో పామును వదిలిన వైనం!

15-07-2020 Wed 18:00
  • మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘటన
  • పెద్ద బాటిల్‌లో పామును తీసుకొచ్చి మహిళ ఉన్న కేబిన్‌లో వదిలిపెట్టిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Shocking CCTV Footage Shows Maharashtra Man Releasing Snake At Petrol Pump

బాటిల్‌లో పెట్రోలు పోయబోమని చెప్పిన ఓ పెట్రోలు బంకులో ఓ వ్యక్తి ఏకంగా పాములు తీసుకొచ్చి వదిలాడు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. రాష్ట్రంలో బుల్దానా జిల్లాకు చెందిన వ్యక్తి బాటిల్ పట్టుకుని పెట్రోలు బంకుకు వెళ్లి పెట్రోలు పోయాలని కోరాడు. అందుకు సిబ్బంది నిరాకరించారు. బాటిల్‌లో పెట్రోలు పోయకూడదని ఆదేశాలు ఉన్నాయని, కాబట్టి పోయబోమని చెప్పారు. దీంతో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయిన ఆ వ్యక్తి కాసేపటి తర్వాత అంతకంటే పెద్ద బాటిల్ తీసుకుని వచ్చాడు.  అయితే, ఈసారి వచ్చింది పెట్రోలు కోసం కాదు. తనకు పెట్రోలు పోసేది లేదన్న ఆ బంకుపై ప్రతీకారం తీర్చుకునేందుకు.

వెంట తీసుకొచ్చిన ఆ బాటిల్‌లో  పెద్ద పాము ఉంది. బాటిల్‌లో నేరుగా బంకులోని గది వద్దకు వెళ్లి అక్కడ పామును విడిచిపెట్టాడు. దాంతో ఆ సమయంలో ఆ గదిలో ఉన్న ఒకే ఒక్క మహిళ భయంతో వణికిపోయింది. అయితే, పాము లోపలికి రాకుండా బయటకు వెళ్లిపోవడంతో తేరుకుని అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో బయటకు వచ్చి హల్‌చల్ చేస్తోంది.