ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే మనమే టాప్: కేటీఆర్

15-07-2020 Wed 15:12
  • గత నాలుగేళ్లుగా ఐటీ దూసుకుపోతోంది
  • నగరం నలువైపులా పెరగాలనేది కేసీఆర్ ఆకాంక్ష
  • ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగిస్తాం
KTR Say Telangana is best in IT devolepment

ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు చాలా ఎక్కువగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్‌లో జరిగిన హైదరాబాద్ గ్రిడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఐటీ పురోగతి గత నాలుగేళ్లుగా బాగుందన్నారు. తూర్పువైపున ఉప్పల్ వైపు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరం లోపల ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే నగరం నలువైపులా సమానంగా అభివృద్ధి చెందాలన్నది కేసీఆర్ ఆకాంక్ష అని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు రోజూ పెద్ద ఎత్తున తరలివచ్చే వేలాదిమంది ప్రజలకు నాణ్యమైన, నివాస యోగ్యమైన స్థలాలు అందుబాటులో ఉండాలంటే నగరం ఒకవైపున మాత్రమే పెరగకూడదని, నలువైపులా పెరగాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని పేర్కొన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలతోపాటు వ్యాపార, వాణిజ్య అవకాశాలు కూడా పెరగాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.