ప్రేమ విఫలమై మనస్తాపం... న్యూస్ చానెల్ ఉద్యోగిని సూసైడ్!

15-07-2020 Wed 08:33
  • హైదరాబాద్ లో పనిచేస్తున్న కల్యాణి
  • రెండేళ్లుగా అదే చానెల్ ఉద్యోగితో ప్రేమ
  • పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య
News Channel Emply Sucide Over Love Failure

ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సిద్దిపేటకు చెందిన పి.రాములు కుమార్తె కల్యాణి (26), ఓ న్యూస్ చానెల్ లో విధులు నిర్వహిస్తూ, గత రెండేళ్లుగా అదే చానెల్ లో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉంది.

ఇటీవల తనను వివాహం చేసుకోవాలని కల్యాణి, శివను కోరగా, అతను నిరాకరించాడు. దీంతో తాను బతకడం వృథా అని భావించిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది. తన సోదరుడితో కలిసి ఆమె ఇక్కడ ఉంటుండగా, అతను విధులు ముగించుకుని వచ్చేసరికి కల్యాణి మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరిలించి, పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. తన కుమార్తె మృతికి శివ కారణమన్న ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని తెలిపారు.