ఐపీఎల్ మీడియా హక్కుల వివాదం.. మధ్యవర్తిత్వం ట్రైబ్యునల్ ద్వారా బీసీసీఐకి రూ. 850 కోట్లు!

15-07-2020 Wed 07:47
  • లలిత్ మోదీ హయాంలో అవకతవకలు
  • డబ్ల్యూఎస్జీతో మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం
  • డీల్ లో కుట్ర ఉందని నిరూపించిన బీసీసీఐ
BCCI Wins 850 Crores

దాదాపు 10 సంవత్సరాల నాడు వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యూఎస్జీ)తో నెలకొన్న వివాదంలో బీసీసీఐకి ఇప్పుడు రూ. 850 కోట్ల పరిహారం వచ్చింది. అప్పట్లో ఐపీఎల్ అంతర్జాతీయ మీడియా హక్కులను పొందిన డబ్ల్యూఎస్జీ, వాటిని వదులుకోగా, దానిపై పరిహారాన్ని కోరుతూ బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు, రిటైర్డ్ న్యాయమూర్తులు సుజాతా మనోహర్, ముకుంఠకన్ శర్మ, ఎస్ఎస్ నిజ్జార్ లతో కూడిన ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసింది.

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బీసీసీఐ నుంచి వైదొలగిన తరువాత ఏర్పడిన వివాదాలన్నీ ఇప్పుడు బీసీసీఐకి లాభిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇది కూడా ఒకటి. అప్పటికే ఎస్క్రో ఖాతాల్లో వేసిన డబ్బులో తమకూ వాటా ఉందని డబ్ల్యూఎస్జీ వాదించగా, ఈ హక్కు ఒప్పందమే మోసపూరితమన్న తన వాదనకు బీసీసీఐ కట్టుబడింది. లలిత్ మోదీ, డబ్ల్యూఎస్జీ అధికారులతో కలిసి మోసం చేసి, ఈ కాంట్రాక్టును వారికి ఇప్పించినట్టు తేలినందునే బీసీసీఐకి చెందాల్సిన డబ్బు వచ్చిందని, ఈ కేసులో బీసీసీఐ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రఘురామన్ వెల్లడించారు.