నేడే రిలయన్స్ ఏజీఎం... మరో కొత్త ఫోన్ ని ఆవిష్కరించనున్న ముఖేష్ అంబానీ!
- మధ్యాహ్నం 2 గంటలకు ముఖేశ్ ప్రసంగం
- పలు కొత్త విషయాలు వెల్లడిస్తారని సమాచారం
- నేడు విడుదల కానున్న జియో ఫోన్ 3!
కాగా, 2017 జూలై 21న జరిగిన రిలయన్స్ 40వ ఏజీఎంలో జియో ఫోన్ ను ముఖేశ్ అంబానీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అదో సంచలనం. దేశ 4జీ చరిత్రగతినే మార్చేసింది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ల సంఖ్యను కోట్లల్లోకి పెంచింది. ప్రతి ఒక్కరికీ డేటాను దగ్గర చేసింది. ఆపై 2018లో జరిగిన 41వ సమావేశంలో జియో ఫోన్ 2ను ముఖేశ్ విడుదల చేశారు.
ఇక నేడు జియో స్మార్ట్ ఫోన్లలో మూడవ తరం ఫోన్ నేడు ప్రజల ముందుకు వస్తుందని సంస్థ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఐదు అంగుళాల డిస్ ప్లేతో ఉంటుందని, చూసేందుకు యాపిల్ చిన్న ఫోన్ లా కనిపించే ఈ స్మార్ట్ ఫోన్ లో 5 ఎంపీ కెమెరా, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయని సమాచారం. దీని ధరల వివరాలు మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలియవు. ఈ విషయాలను నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే సమావేశంలో ముఖేశ్ అంబానీ స్వయంగా వివరిస్తారు.
ఇక ఈ సమావేశంలో ముఖేశ్ అంబానీ, ఇటీవలి సంస్థ విజయాలను, గత సంవత్సరం తాను హామీ ఇచ్చినట్టుగా సంస్థను రుణ విముక్తం చేశానని చెప్పనున్నారని, ఇదే సమయంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరిస్తారని తెలుస్తోంది. హైడ్రోకార్బన్స్ రంగంతో పాటు టెలీ కమ్యూనికేషన్స్, టెక్నాలజీ, సోషల్ మీడియా, వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్స్ పైనా ఆయన మాట్లాడతారని సమాచారం.