సచిన్ పైలట్ పై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ సీనియర్ నేత 

14-07-2020 Tue 18:14
  • రాజస్థాన్ లో బీటలు వారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్
  • పార్టీ కోసం సచిన్ ఎంతో చేశారన్న జితిన్ ప్రసాద
Congress Jitin Prasadas Words Of Praise For Sachin Pilot

రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుదుపుకు గురైంది. ఆ పార్టీ యువనేత, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అధిష్ఠానంపైనే తిరుగుబాటు చేశారు. దీంతో, ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. అంతేకాదు సచిన్ వర్గీయులైన మరో ఇద్దరు మంత్రులను సైతం పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు, సచిన్ పైలట్ కు బీజేపీ ఆహ్వానం పలికింది. ఈ క్రమంలో, కాంగ్రెస్ లోని మరెంత మంది ఎమ్మెల్యేలు సచిన్ వెనుక వస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరి కొంత మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళితే కనుక గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలుతుంది.

ఈ నేపథ్యంలో, సచిన్ పైలట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద ప్రశంసలు కురిపించారు. సచిన్ పైలట్ తన సహచరుడు మాత్రమే కాదని, తన స్నేహితుడు కూడా అని ఆయన తెలిపారు. ఇన్నేళ్లుగా పార్టీ ఉన్నతి కోసం ఎంతో నిబద్ధతతో సచిన్ పని చేశారనే విషయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని అన్నారు. పరిస్థితి ఇంత వరకు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.