ఎల్జీ చైర్మన్ ను అరెస్ట్ చేశారు.. రాంకీ చైర్మన్ ను కూడా అరెస్ట్ చేస్తారా?: బండారు సత్యనారాయణ

14-07-2020 Tue 16:58
  • విశాఖ రాంకీ ఫార్మాసిటీలో ప్రమాదం
  • నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విపక్షాలు
  • ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న బండారు
TDP leader Bandarru demands for arrest of Ramky chairman

విశాఖపట్టణం పరవాడ రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్ కంపెనీలో కెమికల్ ట్యాంకర్ పేలిన ఘటనలో సీనియర్ కెమిస్ట్ దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాల్వెంట్స్ కంపెనీ వద్ద విపక్ష నేతలు నిరసనకు దిగారు.

 ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ ఛైర్మన్ ను అరెస్ట్ చేశారని... ఇప్పుడు రాంకీ ఛైర్మన్ ను అరెస్ట్ చేస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎంత మంది పని చేస్తున్నారో కూడా యాజమాన్యానికి తెలియదని విమర్శించారు.

ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని తొలుత చెప్పారని, ఓ కుటుంబం వచ్చి ధర్నా చేసిన తర్వాత వారిని లోపలకు అనుమతించారని... లోపలకు వెళ్లి చూస్తే ఓ వ్యక్తి కాలిపోయి ఉన్నాడని బండారు అన్నారు. వ్యక్తి చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబానికి కూడా చెప్పలేదని మండిపడ్డారు. ప్రమాద ప్రాంతంలో హైటెన్షన్ లైన్లు ఉన్నాయని, వీటికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికంతా కారణమని ఆరోపించారు.